
Ruu (Collection of Short Stories) | ౠ
Author : Sai Kowluri
Ruu - Collection of Short Stories by Sai Kowluri
జనవరి 2020. ప్రపంచంలో చిన్న కలకలం మొదలయ్యింది. మార్చికి మనందరి తీరం తాకి ముంచేసింది. కోవిడ్ అనే మహోన్మాద ఉప్పెన. హాయిగా ఎగిరే స్వేచ్ఛా విహంగాల రెక్కలు విరిచి ఇంట్లో కూర్చోబెట్టింది. సరిగ్గా అప్పుడే రెక్కలు తొడిగింది - ఏమైనా వ్రాయాలి, ప్రపంచానికి ఏదో చెప్పాలి అనే ఆలోచన. నల్లగొండ కథలు పుస్తక రచయిత వి. మల్లికార్జున్ రాసిన ‘మా అమ్మ ముత్యాలు’, ‘మా నాన్న మారయ్య’ కథలు అంతర్జాలంలో చదివాను. నేను కూడా ఇలా సరళంగా నాకు తోచింది చెప్పచ్చన్న విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం మీరు ఇప్పుడు చదవబోతున్న కథల రూపం దాల్చింది. ఈ పుస్తకంలో మీరు చదవబోయేవి కొన్ని కట్టు కథలు అయితే కొన్ని నేను మూటగట్టుకుని భద్రంగా దాచుకున్న జ్ఞాపకాలు.
చుట్టూ గాఢాంధకారం అలుముకుని ఉన్నప్పుడు, నిరాశ కబళిస్తున్నప్పుడు, అయినవాళ్ళ ఆరోగ్యం కోసం నిరంతరం ఆరాటపడుతూ ఎలాగయినా వాళ్ళని కాపాడుకోవాలని పోరాడుతున్నప్పుడు, అలసిన మనసుల సేద తీర్చాలనుకున్నాను. వాడిన నవ్వులను, వడలిన ఆశలను నాకు చేతనైన రీతి కథా జలాన్ని పోసి చిగురింపజేయాలనుకున్నాను. ప్రేమ, హాస్యం, ఉత్సుకత అనే పోషకాలను చల్లి బలాన్ని చేకూర్చాలని కాంక్షించాను.
- సాయి కౌలూరి.