
Yudham Madhyalo Nuvvu(Poetry) | యుద్ధం మధ్యలో నువ్వు
Author : Afsar
Yudham Madhyalo Nuvvu - Afsar's Poetry.
దర్గాల క్షేత్రస్థాయి అధ్యయనం, సూఫీ కవితలు, రోజా (ఉపవాస) కవితల్లో ప్రతిఫలించే ఉన్నత మానవీయ విలువలైన సమానత్వం, ప్రేమ, స్నేహాలనే కవి ప్రపంచానికీ – మనిషికి నిలవ నీడలేని, విస్థాపన, ఆక్రమణ సామ్రాజ్య వాద కార్పొరేట్ల విస్తరణ యుద్ధానికీ మధ్య సంఘర్షణలో అఫ్సర్ ఇప్పుడు ఈ యుద్ధం మధ్య నిలబడ్డాడు - పాలస్తీనా న్యాయం కోసం, ఆదివాసీ న్యాయం కోసం – అఫ్సర్దే అయిన అభివ్యక్తితో.
- వరవరరావు
నిద్రరాని రాత్రుల్లోనో, ప్రేమ దుప్పటి వెచ్చదనం కోసమో, ఎక్సిస్టెన్షియల్ క్రైసిస్ తెచ్చిపెట్టే కొన్ని మధ్యాహ్నాల్లోనో, యుద్ధం చేస్తూ ఓడిపోతున్నావనిపిస్తుంటేనో, ఆమెకో అతనికో నీ ఇష్టం చెప్పలేనప్పుడో, ఎప్పుడో మర్చిపోయిన కల గుర్తొస్తేనో, ఇంత భాష వచ్చినా పదాలు దొరకడం లేదెందుకో అనిపించే వేళల్లో, కాఫీ తాగుదామని ఇష్టమైన మనిషి నుంచి మెసేజ్ వచ్చినప్పుడో, హోంలెస్ ఫీలింగ్ కలిగినప్పుడో, నచ్చిన పాట మీద ఇంకొంచం ఇష్టం పెంచుకోవాలనుకున్నప్పుడో - అఫ్సర్ కవిత్వం అరువిస్తాడు, ప్రేమగా తెచ్చుకొని చదువుకోండి. ఈ పూల పరిమళాల్ని మీకు పరిచయం చేసే అవకాశం మాకు ఇచ్చినందుకు అఫ్సర్ గారికి ఎప్పటికంటే ఇంకొంచం ఎక్కువ ప్రేమ ఈసారి.
- శ్వేత యర్రం