Aju Publications
Vipula Chatura Nenu, Oka Nenu Oka Canada, Set of Two Books | విపుల చతుర నేను, ఒక నేను-ఒక కెనడా, రెండు పుస్తకాల జత
Vipula Chatura Nenu, Oka Nenu Oka Canada, Set of Two Books | విపుల చతుర నేను, ఒక నేను-ఒక కెనడా, రెండు పుస్తకాల జత
Couldn't load pickup availability
1. విపుల, చతుర, నేను
విపుల, చతుర పత్రికల చేయట్టుకుని అక్షరాలా రెండేళ్ళు నడిచాను. అది చిన్నమాట. మనసును నైవేద్యం చేసుకుని సాకానన్నది అసలు మాట. ఆపై కాలం ఉమిసిన అనేక కారణాల వల్ల వాటి చేయిని విడువక తప్పింది కాదు. ఫలితం... ఊటలా ఉబికొచ్చే జ్ఞాపకాల అడుగుల్లోంచి అప్పుడప్పుడు ఓ అంతర్వేదన పారుతూపారుతూ ఏదో నరాన్ని సొట్ట పడేస్తుండేది.
కరోనా మహమ్మారి చెలరేగి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన అనంతరకాలంలో తెలుగు పత్రికాప్రపంచంలో వచ్చిన భారీ మార్పులు, పరిణామాల ఫలితంగానో, ఈనాడులో సంస్థాగతంగా వచ్చిన పోకడల కారణంగానో ‘విపుల’, ‘చతుర’ 2023లో కాలగతిలో కలిసిపోయాయి. ఆ పత్రికలతో ముడిపడిన నా ప్రస్థానం అతి తక్కువ కాలమే అయినా నాకది ఎంతో అమూల్యం, అపురూపం అనే అనుకుంటాను ఎప్పుడూ.
ఆనాడు విపుల, చతుర మీద ఎంత మనసుపెట్టి పని చేశానో, వాటి గురించిన కెరటాలతో ఈ సాగరాన్ని సృజియించడానికి అంతకు రెట్టింపుగా నన్ను నేను ఒంచేసుకున్నాను. దీని మీద వెచ్చించిన కాలాన్ని నా కవిత్వ రచనకు కైమోడ్పు చేసుకుంటే ఇంకో రెండు కవితా సంపుటాలు ఈపాటికే వచ్చుండేవన్నది వాస్తవం. మరంతగా సాగిన యాగంలో వాస్తవం కాని ఒక్కక్షరమూ మీ కంటిలో నలుసు కాదని భరోసా ఇస్తున్నా.
2. ఒక నేను, ఒక కెనడా
ఖండాంతర దేశంలో బతుకెంత బడుగుదైపోతుందో తెలియపరచడం కోసం నా నడకల్ని ఈ దండ నిండా అల్లుకుంటూపోయాను. అదీ, ఎందుకూ అంటే.. కెనడా వెళ్లి స్థిరపడ్డం మీద కొన్నేళ్లుగా మనదేశవాసుల్లో మోజు పెరిగిపోయింది. వాళ్లు సేకరించే అరకొర సమాచారంతో అనేక భ్రమలు, అపోహలు వాళ్ల మదినిండా. వాటిని పటాపంచలు చేసి, ఆ అర్ధవాస్తవాల్ని తుంచేసి నాకనుభవమైన అక్కడి ప్రపంచాన్ని వాళ్లకు పరిచయం చేద్దామనిపించింది.
ఆపై ఉల్కలా ఊడిపడే చుక్కల్ని కోసుకోడానికి సిద్ధపడాల్సొస్తుందో, చలువపందిరని అనుకున్న ధరణి మీద సూర్యగ్రహణాల్ని తలపాగాగా చుట్టుకుని తమ చుట్టూ తామే భ్రమణాలు పోవాల్సొస్తుందో తెలుసుకుంటారని, తెలివిమంతులవుతారని తలచీనూ..
తెలుసుకున్నాకైనా, మనసులోకి ఇంకించుకున్నాకైనా ఆ తెలివిడితో.. ఎగిరిపోవాలో, ఉన్న నేలనే కాళ్లను కొంత బలంగా నాటుకోవాలో తేల్చుకుంటారనే తలంపుతోనూ..
అదీగాక– కెనడా నుంచి వచ్చేశాక మళ్లీ జంటపత్రికలతో ముడిపడ్డానికి, అది కానప్పుడు ప్రధానస్రవంతిలో మళ్లీ జర్నలిస్టు జీవితాన్ని ఆవహింపజేసుకోడానికి ప్రయత్నాలు సాగించి, విసిగి వేసారి చివరికెలాగో ఆ జీవనాన్ని పొదువుకోడం ‘విపుల, చతుర– నేను’కు కొనసాగింపే, ఒక ముక్తాయింపే కనుక, దాన్నీ పరచడం కోసం..
ఈ పొడిగింపై మీ ముందుకిలా.. మీ ముందిలా.
Share
